ఒంటరి మహిళ ఇంట్లో 25 తులాల బంగారం చోరీ.. ఆపై ఇల్లు దహనం!

  • అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో దారుణం
  • రైల్వే శాఖలో పాయింట్స్‌మెన్‌గా పని చేస్తున్న బాధితురాలు
  • ఉద్యోగానికి వెళ్లిన సమయంలో మొత్తం దోచేసిన దొంగలు

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో దొంగలు ఘోరానికి ఒడిగట్టారు. ఓ ఇంట్లో పెద్ద ఎత్తున సొత్తు దోచుకెళ్లడమే కాకుండా, తమ దొంగతనం బయటపడకుండా ఉండేందుకు ఏకంగా ఆ ఇంటికే నిప్పు పెట్టిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గుంతకల్లు పట్టణానికి చెందిన ఉమాదేవి రైల్వే శాఖలో పాయింట్స్‌మెన్‌గా (Pointsman) పనిచేస్తున్నారు. భర్త మరణించడం, పిల్లలు చదువుల కోసం వేరే ఊరిలో ఉండటంతో ఆమె ఇంట్లో ఒంటరిగానే నివసిస్తున్నారు. బుధవారం ఉదయం ఆమె యథావిధిగా ఇంటికి తాళం వేసి ఉద్యోగానికి వెళ్లారు.


ఆమె లేని సమయం చూసి ఇంటిపై కన్నేసిన దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో దాచిన సుమారు 25 తులాల బంగారు నగలు, 50 తులాల వెండి వస్తువులు, రూ. 20 వేల నగదును దోచుకున్నారు. దొంగతనం చేసిన తర్వాత తమ వేలిముద్రలు లేదా ఇతర ఆధారాలు దొరకకుండా ఉండేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా దొంగలు ఆ ఇంటికి నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు.


నిన్న తెల్లవారుజామున ఉమాదేవి ఇల్లు తగలబడుతూ లోపల నుండి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన పొరుగువారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ... అప్పటికే ఇంట్లోని విలువైన డాక్యుమెంట్లు, బట్టలు, సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు గుంతకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని, క్లూస్ టీమ్ సహాయంతో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Umadevi
Guntakal
Anantapur
Gold theft
House arson
Andhra Pradesh crime

More Telugu News